ఇస్సాకు జీవిత చరిత్ర – బైబిల్ ఆధారంగా సంపూర్ణ వివరణ
ఇస్సాకు బైబిల్లో అబ్రాహాము కుమారుడిగా, యాకోబు తండ్రిగా ఒక ముఖ్యమైన పితామహుడు. ఆయన జీవితం దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడిగా, దేవుని నిబంధనకు వారసుడిగా, విశ్వాస పరీక్షల మధ్య నడిచిన వ్యక్తిగా బైబిల్లో నమోదు చేయబడింది. ఈ వ్యాసం ఇస్సాకు జీవితంలోని ప్రతి ముఖ్యమైన సంఘటనను, ప్రతి చిన్న వివరాన్ని బైబిల్ గ్రంథం ఆధారంగా వివరిస్తుంది. బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన విషయాలను ప్రధానంగా తీసుకుని, అవసరమైన చోట సందర్భాన్ని అర్థం చేసుకునే వివరణను కూడా అందిస్తుంది.
ఇస్సాకు ఎవరు?
ఇస్సాకు అబ్రాహాము, శారాల కుమారుడు. అతను దేవుని వాగ్దానం ద్వారా వృద్ధాప్యంలో పుట్టాడు. అతని భార్య రిబ్కా. అతని కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు సంతానం ఇశ్రాయేలు ప్రజలుగా మారింది. అందువల్ల ఇస్సాకు అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కొనసాగించిన ప్రధాన వ్యక్తి.
ఇస్సాకు జీవితం అబ్రాహాము, యాకోబుల మధ్య ఒక వారధి. అతను గొప్ప యుద్ధాలు చేయలేదు, అనేక ప్రయాణాలు చేయలేదు. కానీ అతని జీవితం దేవుని వాగ్దానం, నిబంధన, కుటుంబ ఆశీర్వాదం, విశ్వాసం, ఓపికలను చూపిస్తుంది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలోని ప్రధాన సంఘటనలను బైబిల్ క్రమంలో చూద్దాం.
1. ఇస్సాకు జననం, పేరు, సున్నతి
అబ్రాహాముకు 100 సంవత్సరాల వయసులో, శారాకు 90 సంవత్సరాల వయసులో, దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం శారా గర్భవతి అయి కుమారుడిని కన్నది. అబ్రాహాము తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే “అతను నవ్వుతాడు” అని అర్థం. ఎనిమిదవ రోజున అతనికి సున్నతి జరిగింది.
శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు, శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను” అని అన్నది. వృద్ధాప్యంలో కుమారుడు పుట్టడం ఆమెకు గొప్ప ఆనందాన్ని తెచ్చింది.
పిల్లవాడు పెరిగి పాలు మాన్పించిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.
2. ఇష్మాయేలు ఎగతాళి, హాగరు పంపించబడటం
విందు సమయంలో హాగరు కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది. ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని గట్టిగా చెప్పింది.
ఈ మాట అబ్రాహాముకు చాలా కష్టం కలిగించింది, ఎందుకంటే ఇష్మాయేలు కూడా తన కుమారుడే. అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది. అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను” అన్నాడు.
అబ్రాహాము ఉదయాన్నే లేచి, రొట్టె, నీళ్ల తిత్తి తీసుకుని హాగరు భుజంపై పెట్టి, ఆమె కుమారుడైన ఇష్మాయేలును ఆమెతో పంపివేశాడు. ఆమె బెయేర్షెబా ఎడారిలో తిరుగసాగింది.
3. మోరియా పర్వతంపై ఇస్సాకును బలిగా అర్పించడం
దేవుడు అబ్రాహామును పరీక్షిస్తూ, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు” అని ఆజ్ఞాపించాడు.
అబ్రాహాము ఉదయాన్నే లేచి, గాడిదపై జీను వేసి, ఇద్దరు సేవకులను, ఇస్సాకును తీసుకుని, దహనబలికి కట్టెలు చీల్చుకుని బయలుదేరాడు. మూడవ రోజు దూరం నుండి ఆ స్థలం కనిపించింది. అబ్రాహాము సేవకులతో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అన్నాడు.
అబ్రాహాము దహనబలి కట్టెలను ఇస్సాకుపై పెట్టాడు. తాను అగ్గి, కత్తి తీసుకున్నాడు. ఇద్దరు నడుస్తుండగా ఇస్సాకు, “నా తండ్రీ” అని పిలిచాడు. అబ్రాహాము, “ఏమిటి నా కుమారుడా?” అన్నాడు. ఇస్సాకు, “తండ్రీ నా కుమారుడా, ఏంటి? నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు. అబ్రాహాము, “నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అన్నాడు.
వారు చేరిన స్థలంలో అబ్రాహాము బలిపీఠం కట్టి, కట్టెలు అమర్చి, ఇస్సాకును కట్టి బలిపీఠం మీద ఉంచాడు. అబ్రాహాము కత్తి తీయబోగా యెహోవా దూత ఆకాశం నుండి పిలిచి, “ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అన్నాడు. అబ్రాహాము చూడగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనిపించింది. దానిని ఇస్సాకుకు బదులుగా దహనబలిగా అర్పించాడు.
దేవుని వాగ్దానం మరియు నెరవేర్పు
ఆ స్థలానికి అబ్రాహాము “యెహోవా యిరే” అని పేరు పెట్టాడు. దేవుడు రెండవసారి పిలిచి, “యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి, నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు” అని ప్రమాణం చేశాడు.
4. శారా మరణం, సమాధి
శారా 127 సంవత్సరాలు జీవించి హెబ్రోనులో మరణించింది. అబ్రాహాము హిత్తీయుల నుండి మక్పేలా గుహను కొని ఆమెను అక్కడ పాతిపెట్టాడు. తరువాత ఆ గుహలోనే అబ్రాహాము, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, లేయాలు పాతిపెట్టబడ్డారు.
5. ఇస్సాకుకు భార్య – రిబ్కా
అబ్రాహాము తన సేవకుడిని పిలిచి, కనానీయులలో నుండి కాక తన బంధువుల దగ్గర నుండి ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని ప్రమాణం చేయించాడు. ఎందుకంటే కనానీయులు విగ్రహాలను పూజించేవారు. దేవుని నిబంధన కుటుంబంలోనే కొనసాగాలని అబ్రాహాము కోరుకున్నాడు.
సేవకుడు నాహోరు పట్టణానికి వెళ్లి, బావి దగ్గర దేవుని నడిపింపు కోరాడు. రిబ్కా అనే కన్య వచ్చి అతనికి, అతని ఒంటెలకు నీళ్లు పోసింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు కుటుంబానికి చెందినది. సేవకుడు ఆమెను తీసుకుని తిరిగి వచ్చాడు.
ఇస్సాకు బెయేరు లహయిరోయి దగ్గర నివసిస్తూ సాయంత్రం పొలంలో ధ్యానించుకుంటూ ఉండగా ఒంటెలు రావడం చూశాడు. రిబ్కా ఇస్సాకును చూసి, “ఆ వస్తున్నది ఎవరు?” అని అడిగింది. సేవకుడు, “నా యజమానుడు” అన్నాడు. ఆమె ముసుకు వేసుకుంది. సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను తన తల్లి శారా గుడారంలోకి తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను ప్రేమించాడు. ఇది అతని తల్లి మరణం తర్వాత అతనికి ఊరట కలిగించింది.
6. అబ్రాహాము మరణం, ఇస్సాకు వారసత్వం
అబ్రాహాము 175 సంవత్సరాలు జీవించి మరణించాడు. అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని మక్పేలా గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము తనకున్న సమస్తమూ ఇస్సాకుకు ఇచ్చాడు. ఇతర ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తూర్పు దేశాలకు పంపాడు. అబ్రాహాము మరణం తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు.
7. ఇస్సాకు కుమారులు – ఏశావు, యాకోబు జననం
ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు అతనికి 40 సంవత్సరాలు. రిబ్కా గొడ్రాలు. ఇస్సాకు తన భార్య కోసం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భవతి అయింది.
గర్భంలో పిల్లలు పెనుగులాడుతుండగా రిబ్కా, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని యెహోవాను అడిగింది. యెహోవా ఆమెతో, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని చెప్పాడు.
కుమారులు పుట్టినప్పుడు, మొదటి వాడు ఎర్రగా, ఒంటిపై వెంట్రుకలతో ఉన్నాడు. అతనికి ఏశావు అని పేరు పెట్టారు. తరువాత అతని సోదరుడు పుట్టాడు. అతను ఏశావు మడమను పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఇస్సాకుకు అప్పుడు 60 సంవత్సరాలు.
8. ఏశావు జన్మహక్కును యాకోబుకు అమ్మడం
పిల్లలు పెరిగారు. ఏశావు నైపుణ్యం కలిగిన వేటగాడు, బయట తిరిగేవాడు. యాకోబు గుడారాలలో నివసించేవాడు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, ఎందుకంటే అతను తెచ్చే వేట మాంసం అతనికి ఇష్టం. రిబ్కా యాకోబును ప్రేమించింది.
ఒక రోజు యాకోబు వంటకం చేస్తుండగా ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి, “నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది). యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్ము” అని అన్నాడు. ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అన్నాడు. యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. ఏశావు ప్రమాణం చేయగా, యాకోబు రొట్టె, పప్పు ఇచ్చాడు. ఏశావు తిని, తాగి లేచి వెళ్లిపోయాడు.
9. ఇస్సాకు గెరారులో – రిబ్కాను సహోదరిగా చెప్పడం
ఆ దేశంలో కరవు రావడంతో ఇస్సాకు గెరారుకు వెళ్లి ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గర నివసించాడు. అక్కడి ప్రజలు రిబ్కా అందం గురించి అడిగినప్పుడు, ఇస్సాకు “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు.
చాలా కాలం తర్వాత అబీమెలెకు కిటికీ నుండి చూసి ఇస్సాకు రిబ్కాను ప్రేమిస్తుండడం చూశాడు. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిచి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు. అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని హెచ్చరించి, “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును” అని ప్రజలకు ఆజ్ఞాపించాడు.
10. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై వాగ్దానం ఇవ్వడం
కరవు సమయంలో దేవుడు ఇస్సాకుకు కనిపించి, “ఐగుప్తుకు వెళ్లవద్దు. నేను చెప్పే దేశంలో నివసించు. నేను నీకు, నీ సంతానానికి ఈ దేశాలన్నిటినీ ఇస్తాను. అబ్రాహాముకు నేను ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాను. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత చేస్తాను. నీ సంతానం ద్వారా భూజాతులన్నీ ఆశీర్వదించబడతాయి” అని చెప్పాడు.
11. ఇస్సాకు సంపద, బావుల వివాదాలు
ఇస్సాకు ఆ దేశంలో వ్యవసాయం చేసి, అదే సంవత్సరం వంద రెట్లు పంట పండించాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అతను గొప్ప ధనవంతుడయ్యాడు. అతనికి గొర్రెలు, పశువులు, సేవకులు చాలా మంది ఉన్నారు. ఫిలిష్తీయులు అతనిపై అసూయ చెందారు.
అతని తండ్రి అబ్రాహాము తవ్వించిన బావులను ఫిలిష్తీయులు మట్టితో పూడ్చివేశారు. అబీమెలెకు, “నీవు మా దగ్గర నుండి వెళ్లిపో, నీవు మా కంటే బలవంతుడవు అయ్యావు” అన్నాడు.
ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. అతను తన తండ్రి తవ్వించిన బావులను మళ్లీ తవ్వించాడు. అక్కడ సేవకులు ఒక నీటి ఊట బావిని తవ్వారు. గెరారు కాపరులు, “ఈ నీరు మాది” అని వాదించారు. అందుకు ఇస్సాకు ఆ బావికి ఏసెకు (వివాదం) అని పేరు పెట్టాడు. మరో బావి తవ్వగా మళ్లీ వివాదం వచ్చింది, దానికి సిత్నా (శత్రుత్వం) అని పేరు పెట్టాడు. తర్వాత మరో బావి తవ్వగా వివాదం రాలేదు. దానికి రెహోబోతు (విశాల స్థలం) అని పేరు పెట్టి, “ఇప్పుడు యెహోవా మనకు విశాల స్థలం ఇచ్చాడు, మనం ఈ దేశంలో వృద్ధి చెందుతాము” అన్నాడు.
12. బెయేర్షెబాలో దేవుని దర్శనం, బలిపీఠం
ఇస్సాకు బెయేర్షెబాకు వచ్చిన తర్వాత ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, “భయపడకు, నేను నీతో ఉన్నాను” అని చెప్పాడు. దేవుడు అబ్రాహాము నిమిత్తం ఇస్సాకును ఆశీర్వదించి, అతని సంతానాన్ని విస్తరింపజేస్తానని మళ్లీ ధృవీకరించాడు. ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామాన్ని ప్రకటించాడు. అతని సేవకులు అక్కడ బావి తవ్వారు.
13. అబీమెలెకుతో నిబంధన
అబీమెలెకు, అతని సలహాదారు అహుజతు, సేనాధిపతి ఫీకోలు ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇస్సాకు, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు. వారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము. మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు” అన్నారు.
ఇస్సాకు వారికి విందు చేసి, వారు అతనితో ఒప్పందం చేసుకున్నారు. ఉదయం ప్రమాణం చేసుకుని ఇస్సాకు వారిని పంపాడు. అదే రోజు సేవకులు తవ్విన బావి గురించి చెప్పి, “నీళ్లు దొరికాయి” అన్నారు. ఇస్సాకు దానికి షిబా అని పేరు పెట్టాడు. అందువల్ల ఆ పట్టణానికి బెయేర్షెబా అని పేరు వచ్చింది.
14. ఏశావు హిత్తీయుల స్త్రీలను వివాహం చేసుకోవడం
ఏశావు 40 సంవత్సరాల వయసులో హిత్తీయ స్త్రీలైన యూదితు, బాషెమతులను పెండ్లి చేసుకున్నాడు.
15. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం – ఏశావు నిరాశ
ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, “నా కుమారుడా” అన్నాడు. ఏశావు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు. ఇస్సాకు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు. నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు.
రిబ్కా ఈ మాటలు విని యాకోబుకు తెలియజేసింది. ఆమె యాకోబుచేత మేకపిల్లల మాంసంతో వంట చేయించి, ఏశావు మంచి వస్త్రాలను అతనికి తొడిగి, అతని చేతులకు, మెడకు మేక చర్మం కప్పింది. యాకోబు తన తండ్రి వద్దకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు. ఇస్సాకు, “నా కుమారుడా, నీవెవరివి?” అని అడిగాడు. యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు.
ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు. ఇస్సాకు, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అన్నాడు. యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతనిని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అనుకుంటూ అతనిని ఆశీర్వదించాడు:
“దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక. జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
— ఆదికాండము 27:28-29
యాకోబు అక్కడ నుండి వెళ్లిన వెంటనే ఏశావు వేట నుండి తిరిగి వచ్చి రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చి, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అన్నాడు. ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు. అతను, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు. ఇస్సాకు గజగజ వణకుతూ, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!” అన్నాడు.
ఏశావు ఆ మాటలు విని దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని వేడుకున్నాడు. ఇస్సాకు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు. ఏశావు, “అతనికి యాకోబు అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని విలపించాడు. ఇస్సాకు, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అన్నాడు. ఏశావు, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
16. ఏశావు మళ్లీ వివాహం చేసుకోవడం
ఇస్సాకు యాకోబును పద్దను అరాముకు పంపించాడని, అక్కడ నుండి భార్యను తీసుకురమ్మని ఆశీర్వదించాడని ఏశావు తెలుసుకున్నాడు. తన తండ్రికి కనానీయుల స్త్రీలు నచ్చడం లేదని గ్రహించి, ఏశావు ఇష్మాయేలు కుమార్తె మహలతును పెండ్లి చేసుకున్నాడు.
17. ఇస్సాకు యాకోబును పద్దను అరాముకు పంపడం
రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని చెప్పింది.
ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించి, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు. వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో. సర్వశక్తిగల దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఫలభరితంగా చేసి, జనాంగాల సమాజంగా విస్తరించేలా సంఖ్యాపరంగా వృద్ధి చేయును గాక. ఆయన నీకును, నీ వారసులకు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చును గాక” అని ఆజ్ఞాపించి పంపాడు.
18. యాకోబు తిరిగి రావడం, ఇస్సాకు మరణం
యాకోబు చాలా సంవత్సరాలు లాబాను దగ్గర ఉండి, తర్వాత కనానుకు తిరిగి వచ్చాడు. అతను ఏశావును కలుసుకున్న తర్వాత హెబ్రోనులోని తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించి, వృద్ధుడై మరణించాడు. అతని కుమారులు ఏశావు, యాకోబు అతన్ని మక్పేలా గుహలో, అబ్రాహాము, శారాల సమీపంలో పాతిపెట్టారు.
19. ఇస్సాకు జీవితం నుండి నేర్చుకునే పాఠాలు
- వాగ్దాన వారసుడు: ఇస్సాకు దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడు. అతను అబ్రాహాము నిబంధనకు వారసుడు.
- విశ్వాసం, విధేయత: ఇస్సాకు తండ్రికి లోబడి బలిపీఠం పైకి ఎక్కాడు. అతను తన జీవితంలో దేవుని నడిపింపును అనుసరించాడు.
- దేవుని ఆశీర్వాదం: కరవు సమయంలో కూడా ఇస్సాకు వంద రెట్లు పంట పండించాడు. దేవుడు అతనిని ఎక్కడ ఉన్నా ఆశీర్వదించాడు.
- శాంతి, ఓపిక: బావుల వివాదాల్లో ఇస్సాకు పోరాడకుండా ముందుకు వెళ్లి కొత్త బావులు తవ్వాడు. అతను శాంతిని కోరాడు.
- కుటుంబ బాధలు: ఇస్సాకు కుమారుల మధ్య విభేదాలు, మోసం అతని జీవితంలో బాధ కలిగించాయి. అయినా దేవుని ప్రణాళిక ముందుకు సాగింది.
20. కొత్త నిబంధనలో ఇస్సాకు ప్రస్తావనలు
- హెబ్రీయులకు 11:17-20 — అబ్రాహాము విశ్వాసంతో ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు విశ్వాసంతో యాకోబు, ఏశావులను ఆశీర్వదించాడు.
- రోమా 9:10-13 — రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. ఇది దేవుని సార్వభౌమ ఎన్నికను చూపుతుంది.
- గలతీయులకు 4:28 — విశ్వాసులు ఇస్సాకు వలె వాగ్దాన సంతానం.
- యాకోబు 2:21 — అబ్రాహాము ఇస్సాకును బలిపీఠం మీద అర్పించడం విశ్వాసానికి ఉదాహరణ.
21. ఇస్సాకు జీవితంలోని ముఖ్య సంఘటనల కాలక్రమం
- అబ్రాహాముకు 100 సంవత్సరాలకు ఇస్సాకు జననం
- ఇస్సాకుకు 8వ రోజు సున్నతి
- పాలు మాన్పించినప్పుడు విందు
- ఇస్సాకును మోరియాలో బలిగా అర్పించడానికి ప్రయత్నం
- తల్లి శారా మరణం
- 40 సంవత్సరాలకు రిబ్కాతో వివాహం
- 60 సంవత్సరాలకు ఏశావు, యాకోబు జననం
- గెరారులో నివాసం, బావుల వివాదాలు
- వృద్ధాప్యంలో యాకోబును ఆశీర్వదించడం
- 180 సంవత్సరాలకు మరణం
22. ఇస్సాకు – దేవుని నిబంధనలో కొనసాగింపు
ఇస్సాకు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేవుని నిబంధనను అందుకున్నాడు. అతను తన జీవితంలో పెద్ద యుద్ధాలు చేయకపోయినా, దేవుని వాగ్దానంతో నడిచిన అనేక సందర్భాలు అతని జీవితంలో కనిపిస్తాయి. బావుల వివాదాల్లో అతను వెనక్కి వెళ్లి శాంతిని కోరడం, దేవుని ప్రత్యక్షతను స్వీకరించడం, తన కుమారులను ఆశీర్వదించడం వంటి సంఘటనలు అతని జీవితంలోని ముఖ్యమైన అంశాలను చూపిస్తాయి. అతని ద్వారా యాకోబు పుట్టి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూలం అయ్యాడు. ఇస్సాకు జీవితం దేవుని నమ్మకత్వానికి, మానవ బలహీనతల మధ్య దేవుని కృపకు సాక్ష్యం.
ఇస్సాకు జీవితానికి సంబంధించిన బైబిల్ వచనాలు
- ఇస్సాకు జననం, సున్నతి, విందు — ఆదికాండము 21:1–8
- ఇష్మాయేలు ఎగతాళి, హాగరు పంపించబడటం — ఆదికాండము 21:9–21
- ఇస్సాకును మోరియాలో బలిగా అర్పించడం — ఆదికాండము 22:1–19
- శారా మరణం, సమాధి — ఆదికాండము 23:1–20
- ఇస్సాకుకు భార్య – రిబ్కా — ఆదికాండము 24:1–67
- అబ్రాహాము మరణం, ఇస్సాకు వారసత్వం — ఆదికాండము 25:5–11
- ఏశావు, యాకోబు జననం — ఆదికాండము 25:19–26
- ఏశావు జన్మహక్కును అమ్మడం — ఆదికాండము 25:27–34
- గెరారులో ఇస్సాకు, రిబ్కాను సహోదరిగా చెప్పడం — ఆదికాండము 26:1–11
- దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై వాగ్దానం ఇవ్వడం — ఆదికాండము 26:2–5
- ఇస్సాకు సంపద, బావుల వివాదాలు — ఆదికాండము 26:12–22
- బెయేర్షెబాలో దేవుని దర్శనం, బలిపీఠం — ఆదికాండము 26:23–25
- అబీమెలెకుతో నిబంధన — ఆదికాండము 26:26–33
- ఏశావు హిత్తీయుల స్త్రీలను వివాహం చేసుకోవడం — ఆదికాండము 26:34–35
- ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం — ఆదికాండము 27:1–40
- రిబ్కా హిత్తీయుల కోడళ్ల వల్ల విసిగిపోవడం — ఆదికాండము 27:46
- ఇస్సాకు యాకోబును పద్దను అరాముకు పంపడం — ఆదికాండము 28:1–5
- ఏశావు ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకోవడం — ఆదికాండము 28:6–9
- ఇస్సాకు మరణం — ఆదికాండము 35:27–29
- కొత్త నిబంధనలో ఇస్సాకు ప్రస్తావనలు — హెబ్రీయులకు 11:17–20; రోమా 9:10–13; గలతీయులకు 4:28; యాకోబు 2:21
సంబంధిత వ్యాసాలు
గమనిక
1. వచనం: ఈ వ్యాసంలోని బైబిల్ వచనాలు Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ (Biblica® Open Telugu Contemporary Version™) నుండి తీసుకున్నవి. ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. ఇవి CC BY-SA 4.0 లైసెన్స్ కింద ఉపయోగించబడ్డాయి (మూలం: ebible.org/telotsa). దీనిని Biblica ఆమోదించినట్టు కాదు. ప్రతి వచనం కింద, అది ఏ సందర్భంలో చెప్పబడిందో వివరించాం. వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మీ బైబిల్లో ఆ అధ్యాయాన్ని మొత్తం చదవండి.
2. భాష: బైబిల్ గురించి ఎక్కువగా తెలియనివారికి కూడా అర్థమయ్యేలా ఈ వ్యాసాన్ని సాధారణ తెలుగులో రాశాం. ఇది వ్యక్తిగత అధ్యయనం, అవగాహన కోసం రాసిన వ్యాసం. అధికారిక బైబిల్ వ్యాఖ్యానం కాదు.
3. చరిత్ర: ఈ వ్యాసంలో బైబిల్ చరిత్రలో లేని అదనపు వివరణలు ఎక్కడైనా ఇస్తే, అవి కేవలం అర్థం చేసుకోవడానికి సహాయపడే ఊహాజనిత వివరణలు మాత్రమే అని గమనించండి.
వ్రాసినవారు: టీమ్ HolyBibleWithYou.com
