పరిచయం
దావీదు కథ కేవలం ఒక గొర్రెల కాపరి రాజు అవడం కాదు. అతను ఎవరూ గుర్తించని సమయంలో దేవుడు ఎంచుకున్న వ్యక్తి. తనకంటే బలమైన శత్రువును ఎదుర్కొన్నవాడు. సంవత్సరాల తరబడి ప్రాణం కోసం పారిపోయినవాడు. పెద్ద తప్పులు చేసినవాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచడం మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నవాడు.
దావీదు ఇశ్రాయేలు సింహాసనం ఎక్కకముందే దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. అయితే సమూయేలు అతన్ని అభిషేకించిన రోజు నుండి ఇశ్రాయేలు అంతటికీ రాజు అయ్యే వరకు చాలా కఠినమైన, దీర్ఘమైన ప్రయాణం ఉంది.
దావీదు జీవితంలో ధైర్యం, స్నేహం, ద్రోహం, భయం, విజయం, వైఫల్యం, పశ్చాత్తాపం, కుటుంబ విషాదం, ఇక ఎక్కడికి వెళ్లాలో తోచని సమయాల్లో దేవునిపై పూర్తిగా ఆధారపడడం ఇవన్నీ ఉన్నాయి.
1. దావీదు ఇంకా గొర్రెల కాపరిగా ఉండగానే అభిషేకం
సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. కానీ అతను దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించలేదు. అందుకే దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా నిరాకరించాడు. ప్రవక్త సమూయేలు సౌలు విషయంలో దుఃఖిస్తూ ఉండగా, యెహోవా అతనితో ఇలా చెప్పాడు:
“ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” — 1 సమూయేలు 16:1
సమూయేలు భయపడ్డాడు. “నేను ఎలా వెళ్లను? నేను వెళ్లిన సంగతి సౌలు వింటే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. అప్పుడు యెహోవా ఒక పశువును తీసుకెళ్ళి బలి అర్పించడానికి వచ్చావని చెప్పమన్నాడు.
సమూయేలు బేత్లెహేముకు వచ్చాడు. పట్టణ పెద్దలు అతన్ని చూసి వణుకుతూ, “సమాధానంగా వచ్చావా?” అని అడిగారు. సమూయేలు, “అవును, సమాధానంగానే వచ్చాను, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతోకూడ బలి ఇవ్వడానికి రండి” అన్నాడు.
సమూయేలు యెష్షయిని, అతని కొడుకులను బలికి పిలిచాడు. వారు వచ్చినప్పుడు, యెష్షయి పెద్ద కొడుకు ఎలీయాబును చూసి సమూయేలు, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు.
కానీ యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు:
“అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” — 1 సమూయేలు 16:7
తర్వాత యెష్షయి అబీనాదాబును పిలిపించగా, అతన్ని కూడా యెహోవా ఏర్పరచలేదు. షమ్మాను పిలిపించగా, అతన్నీ కాదు. యెష్షయి తన ఏడుగురు కొడుకులను సమూయేలు ముందు నిలబెట్టాడు. సమూయేలు, “నీ కుమారులంతా వీరేనా?” అని యెష్షయిని అడిగాడు.
అందుకు యెష్షయి, “ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడు” అని చెప్పాడు.
సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు.
దావీదును పిలిపించారు. అతను ఎర్రని వర్ణంతో, అందమైన కన్నులతో, చూడ్డానికి చాలా సుందరంగా ఉన్నాడు. యెహోవా సమూయేలుతో, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నాడు.
సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసుకుని, అతని సహోదరుల మధ్య దావీదును అభిషేకించాడు. ఆ దినం నుండి యెహోవా ఆత్మ దావీదుపై బలంగా వచ్చింది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు.
దావీదు ఆ రోజు సింహాసనం ఎక్కలేదు. సైన్యాన్ని నడిపించలేదు. అతను కేవలం ఒక గొర్రెల కాపరి. కానీ దేవుడు అతన్ని చాలా గొప్పదానికి సిద్ధం చేస్తున్నాడు.
2. దావీదు సౌలుకు సేవ చేస్తాడు
సౌలు మీద నుండి దేవుని ఆత్మ తొలగిపోయింది. యెహోవా వద్ద నుండి ఒక దురాత్మ అతన్ని బాధిస్తూ ఉండేది. సౌలు సేవకులు, “మా ప్రభువైన నీవు నీ సేవకులకు ఆజ్ఞ ఇస్తే సితారా చక్కగా వాయించగల ఒకనిని వెదికి తీసుకువస్తాము. దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా వాయించడం వలన నీకు బాగవుతుంది” అన్నారు.
ఒక సేవకుడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అన్నాడు.
సౌలు యెష్షయికి వర్తమానం పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అన్నాడు.
యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ఒక తిత్తి ద్రాక్షారసం, ఒక మేకపిల్లను మోపించి, దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని సేవలో నిలిచాడు. సౌలు అతన్ని చాలా ప్రేమించాడు; దావీదు సౌలుకు ఆయుధధారి అయ్యాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు సితారా తీసుకుని వాయించేవాడు. అప్పుడు సౌలుకు ఉపశమనం కలిగేది, దురాత్మ అతన్ని విడిచిపోయేది.
3. దావీదు గొల్యాతును ఎదుర్కొంటాడు
ఫిలిష్తీయులు యుద్ధానికి సైన్యాలను సమకూర్చి, యూదాలోని సోకోలో విడిది చేశారు. సౌలు, ఇశ్రాయేలీయులు ఏలా లోయలో విడిది చేసి ఫిలిష్తీయులకు ఎదురుగా నిలిచారు.
ఫిలిష్తీయుల శిబిరం నుండి గత్ పట్టణానికి చెందిన గొల్యాతు అనే శూరుడు బయటకు వచ్చాడు. అతని ఎత్తు ఆరు మూరలు, ఆరు అంగుళాలు. తలపై ఇత్తడి శిరస్త్రాణం, ఒంటిపై పొలుసుల కవచం ఉన్నాయి. ఆ కవచం బరువు ఐదు వేల తులముల ఇత్తడి. కాళ్ళపై ఇత్తడి పాదరక్షలు, భుజాల మధ్య ఇత్తడి ఈటె ఉన్నాయి. ఈటె కఱ్ఱ మగ్గపు దూలంలా ఉంది; దాని మొన ఇనుము బరువు ఆరు వందల తులములు. కేడెము మోసేవాడు అతని ముందు నడిచాడు.
నలభై దినములు ఉదయం, సాయంత్రం గొల్యాతు నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని సవాలు చేశాడు:
“గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు.” — 1 సమూయేలు 17:8-10
సౌలు, ఇశ్రాయేలీయులంతా ఈ మాటలు విని చాలా భయపడ్డారు.
దావీదు ముగ్గురు పెద్ద అన్నలు — ఎలీయాబు, అబీనాదాబు, షమ్మా — సౌలుతో యుద్ధానికి వెళ్లారు. దావీదు బేత్లెహేములో తండ్రి గొర్రెలను కాస్తున్నాడు.
యెష్షయి దావీదుతో, “నీ అన్నల కోసం ఒక ఏఫా వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు. అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా” అన్నాడు.
దావీదు ఉదయాన్నే లేచి, గొర్రెలను కాపరి దగ్గర అప్పగించి, యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్లాడు. అతను వచ్చేసరికి సైన్యం యుద్ధానికి సిద్ధమై కేకలు వేస్తోంది. దావీదు సామాను కాపరి దగ్గర ఉంచి, యుద్ధరంగానికి పరిగెత్తి అన్నలను కుశలం అడిగాడు.
గొల్యాతు మళ్ళీ బయటకు వచ్చి అదే మాటలు అన్నాడు. దావీదు విన్నాడు. ఇశ్రాయేలీయులంతా గొల్యాతును చూసి భయపడి పారిపోయారు.
దావీదు దగ్గర ఉన్నవారితో, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.
అతని పెద్ద అన్న ఎలీయాబు కోపంతో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు. కానీ దావీదు అదే మాట అందరితో చెప్పాడు.
సౌలుకు దావీదు మాటలు తెలిశాయి; అతను దావీదును పిలిపించాడు.
దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.
సౌలు, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అన్నాడు.
దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే, నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు” అన్నాడు.
సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అన్నాడు.
సౌలు తన కవచం దావీదుకు వేయించి, తలపై ఇత్తడి శిరస్త్రాణం పెట్టించి, కవచం తొడిగించాడు. దావీదు కత్తి కట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు, కానీ అలవాటు లేకపోవడంతో నడవలేకపోయాడు. “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని వాటిని తీసివేశాడు.
అతను తన చేతికర్ర తీసుకుని, వాగులో నుండి ఐదు నునుపైన రాళ్లను ఏరుకుని, గొర్రెల కాపరి సంచిలో వేసుకున్నాడు. చేతిలో ఒడిసెలతో ఫిలిష్తీయుడి వైపు నడిచాడు.
గొల్యాతు దావీదును చూసి తృణీకరించాడు. “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని తన దేవుళ్ల పేరట దావీదును శపించాడు. “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.
దావీదు ఇలా జవాబిచ్చాడు:
దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది” అని జవాబిచ్చాడు. — 1 సమూయేలు 17:45-47
గొల్యాతు దగ్గరకు రాగానే, దావీదు సంచిలో నుండి ఒక రాయి తీసి ఒడిసెతో విసిరాడు. రాయి గొల్యాతు నుదిటికి గుచ్చుకుంది. గొల్యాతు నేలపై బోర్లా పడిపోయాడు. దావీదు అతని కత్తిని తీసి అతన్ని చంపి తల నరికాడు.
ఫిలిష్తీయులు తమ శూరుడు చనిపోవడం చూసి పారిపోయారు. ఇశ్రాయేలీయులు లేచి కేకలు వేస్తూ వారిని గత్, ఎక్రోను ద్వారాల వరకు తరిమారు.
దావీదు గొల్యాతు తలను యెరూషలేముకు తీసుకెళ్లాడు; అతని ఆయుధాలను తన గుడారంలో ఉంచాడు.
4. యొనాతాను స్నేహం, సౌలు అసూయ
దావీదు సౌలుతో మాట్లాడి ముగించిన తర్వాత, సౌలు కొడుకు యొనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యొనాతాను దావీదును తన ప్రాణంలా ప్రేమించాడు. ఆ రోజు సౌలు దావీదును తన దగ్గరే ఉంచుకున్నాడు; అతన్ని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనివ్వలేదు.
యొనాతాను, దావీదు ఒక నిబంధన చేసుకున్నారు. యొనాతాను తన వస్త్రం, కత్తి, విల్లు, నడికట్టు దావీదుకు ఇచ్చాడు.
సౌలు దావీదును యుద్ధాలకు పంపిన ప్రతి చోటా అతను విజయం సాధించాడు. ప్రజలు, సౌలు సేవకులు అతన్ని అంగీకరించారు.
దావీదు గొల్యాతును చంపి తిరిగి వస్తుండగా, ఇశ్రాయేలు పట్టణాల్లోని స్త్రీలు నాట్యం చేస్తూ, సంగీత వాయిద్యాలతో ఇలా పాడారు:
“సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” — 1 సమూయేలు 18:7
ఈ మాటకు సౌలుకు చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?” అనుకున్నాడు. ఆ రోజు నుండి సౌలు దావీదుపై కన్ను వేశాడు.
మరుసటి రోజు దురాత్మ సౌలుపై బలంగా వచ్చినప్పుడు, దావీదు ఎప్పటిలాగే సితారా వాయించాడు. సౌలు చేతిలో ఈటె ఉంది; “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని ఈటె విసిరాడు. దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని, సౌలు దావీదుకు భయపడ్డాడు. అతను దావీదును తన దగ్గర నుండి తొలగించి, వెయ్యి మందికి అధిపతిగా నియమించాడు. దావీదు ప్రజల మధ్య విజయం సాధిస్తూనే ఉన్నాడు.
5. మీకాలు, సౌలు కుతంత్రం
సౌలు తన పెద్ద కూతురు మేరాబును దావీదుకు ఇస్తానన్నాడు. కానీ ఆమెను మరొకరికి ఇచ్చేశాడు. సౌలు చిన్న కూతురు మీకాలు దావీదును ప్రేమించింది.
సౌలు ఈ విషయం తెలుసుకుని సంతోషించాడు. “ఆమెను అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తాను అప్పుడు ఆమె అతనికి ఉరిగా మారి ఫిలిష్తీయుల చేయి అతని మీద పడుతుంది” అనుకున్నాడు.
సౌలు దావీదుతో, “నీవు నా అల్లుడు అవ్వడానికి నీకు మరో అవకాశం ఉంది” అన్నాడు. సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.
దావీదు, “రాజుకు అల్లుడు కావడం చిన్న విషయమా? నేను ఒక పేదవాన్ని అంతగా గుర్తింపులేనివాన్ని” అన్నాడు.
సౌలు, “రాజు వధువుకు కట్నంగా ఏమి కోరడంలేదు గాని రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకువస్తే సరిపోతుందని దావీదుతో చెప్పండి” అన్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో చనిపోవాలని సౌలు ఆలోచించాడు.
దావీదు ఈ మాటలకు సంతోషించి, తన మనుష్యులతో వెళ్లి రెండు వందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి ముందుచర్మాలు తెచ్చి రాజుకు అప్పగించాడు. సౌలు తన కూతురు మీకాలును దావీదుకు భార్యగా ఇచ్చాడు.
సౌలు యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని చూసి మరింత భయపడ్డాడు; అతను దావీదుకు నిత్య శత్రువు అయ్యాడు.
6. మీకాలు దావీదును తప్పించడం
సౌలు తన కొడుకు యొనాతానుతో, సేవకులందరితో దావీదును చంపమని చెప్పాడు. యొనాతాను దావీదును హెచ్చరించాడు.
యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు. అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు. సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు.
కానీ యుద్ధం మళ్లీ జరిగినప్పుడు, దురాత్మ తిరిగి వచ్చింది. దావీదు సితారా వాయిస్తుండగా, సౌలు మళ్లీ ఈటె విసిరాడు. దావీదు పారిపోయాడు.
సౌలు దావీదు ఇంటిని కాపలా పెట్టించి, ఉదయం అతన్ని చంపమని పంపాడు. మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని చెప్పి, దావీదును కిటికీ ద్వారా దింపింది.
మీకాలు ఒక విగ్రహాన్ని మంచం మీద పెట్టి, మేకల వెంట్రుకలతో చేసిన దుప్పటిని తల క్రింద పెట్టి, బట్టతో కప్పింది. సౌలు దూతలు వచ్చినప్పుడు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది. సౌలు, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు. దూతలు వచ్చి చూసేసరికి మంచంలో విగ్రహం ఉంది.
సౌలు మీకాలుతో, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని అడిగాడు. మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.
దావీదు రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు పారిపోయాడు. సౌలు దూతలను పంపగా, వారు ప్రవక్తల గుంపును చూసి ప్రవచించారు. సౌలు మళ్లీ మళ్లీ దూతలను పంపాడు; వారు కూడా ప్రవచించారు. చివరకు సౌలు స్వయంగా రామాకు వెళ్లాడు. దేవుని ఆత్మ అతనిపై వచ్చింది. అతను బట్టలు తీసేసి, ప్రవచిస్తూ నేలపై పడి ఉన్నాడు. అందుకే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే మాట వచ్చింది.
7. యొనాతాను దావీదును హెచ్చరించడం
దావీదు నాయోతు నుండి పారిపోయి, యొనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.
వారిద్దరూ ఒక ప్రణాళిక వేశారు. మరుసటి రోజు అమావాస్య పండుగ; దావీదు రాజు బల్ల వద్ద భోజనానికి ఉండాల్సినవాడు. దావీదు మూడు రోజులు పొలంలో దాక్కున్నాడు.
యొనాతాను దావీదుతో, “అయితే బాణాలను నీకు అవతల వైపు ఉన్నాయని నేను వానితో చెప్తే పారిపొమ్మని యెహోవా చెప్తున్నారని తెలుసుకొని నీవు ప్రయాణమై వెళ్లిపోవాలి.” అన్నాడు.
పండుగ రోజు దావీదు స్థలం ఖాళీగా ఉంది. సౌలు మొదటి రోజు ఏమీ అనలేదు. రెండవ రోజు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని అడిగాడు. యొనాతాను దావీదు చెప్పినట్టు జవాబిచ్చాడు.
సౌలుకు చాలా కోపం వచ్చింది. “యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీవు గాని నీ రాజ్యం గాని స్ధిరపడదు. కాబట్టి నీవు ఎవరినైనా పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, అతడు తప్పక చావాల్సిందే” అని చెప్పాడు.
యొనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని అడిగాడు. సౌలు యొనాతానుపై ఈటె విసిరాడు. అప్పుడు యొనాతానుకు తండ్రి దావీదును చంపాలని నిశ్చయించాడని తెలిసింది.
మరుసటి రోజు యొనాతాను పొలంలో బాణం వేసి సంకేతం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఏడ్చారు. యొనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అన్నాడు. దావీదు వెళ్లిపోయాడు, యొనాతాను పట్టణానికి తిరిగి వచ్చాడు.
8. నోబులో దావీదు, యాజకుల హత్య
దావీదు నోబు పట్టణంలోని యాజకుడు అహీమెలెకు దగ్గరకు వెళ్లాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.
దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను. నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు” అన్నాడు.
అహీమెలెకు, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని దేవుని ఎదుట నుండి తీసిన పవిత్ర రొట్టెలు ఇచ్చాడు.
దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు. అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు. దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.
అక్కడ సౌలు సేవకుడు దోయేగు అనే ఎదోమీయుడు ఉన్నాడు. తర్వాత అతను సౌలుకు ఈ విషయం చెప్పాడు.
దావీదు గత్ పట్టణానికి పారిపోయాడు. అక్కడి రాజు ఆకీషు సేవకులు దావీదును గుర్తించారు. దావీదు భయపడి, పిచ్చివాడిలా నటించాడు. ఆకీషు రాజు తన సేవకులతో, “అతన్ని చూడండి! అతడు పిచ్చివాడు. అతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు? పిచ్చి చేష్టలు చేసేవానితో నాకేమి పని? నా ఎదుట పిచ్చి చేష్టలు చేయడానికి ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇలాంటివాడు నా ఇంట్లోకి రావాలా?” అని పంపివేశాడు.
దావీదు అదుల్లాము గుహకు వెళ్లాడు. అతని కుటుంబం, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులపాలైనవారు, బాధలో ఉన్నవారు అందరూ అతని దగ్గరకు వచ్చారు. అతను వారికి నాయకుడయ్యాడు. అతనితో నాలుగు వందల మంది ఉన్నారు.
దావీదు తన తల్లిదండ్రులను మోయాబు రాజు దగ్గర ఉంచాడు. ప్రవక్త గాదు, “బలమైన కోటలలో ఉండవద్దు, యూదా దేశానికి పారిపో” అన్నాడు.
సౌలు దోయేగు చెప్పిన మాట ప్రకారం, నోబులో ఉన్న ఎనభై ఐదుగురు యాజకులను, వారి కుటుంబాలను చంపించాడు. అహీమెలెకు కొడుకు అబ్యాతారు మాత్రం తప్పించుకుని దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు అతన్ని రక్షించాడు.
9. దావీదు కెయీలాను రక్షించడం
ఫిలిష్తీయులు కెయీలా పట్టణం మీద దాడి చేశారు. దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అన్నాడు.
దావీదు మనుష్యులు భయపడ్డారు. దావీదు మళ్లీ దేవుణ్ణి అడిగాడు. దేవుడు, “నీవు లేచి కెయీలాకు వెళ్లు, నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను” అన్నాడు.
దావీదు, అతని మనుష్యులు వెళ్లి ఫిలిష్తీయులను ఓడించి కెయీలాను రక్షించారు.
సౌలు దావీదు కెయీలాలో ఉన్నాడని తెలుసుకుని, అతన్ని పట్టుకోవడానికి సైన్యం సమకూర్చాడు. దావీదు దేవుణ్ణి అడిగాడు; కెయీలా పెద్దలు తనను సౌలుకు అప్పగిస్తారని దేవుడు చెప్పాడు. కాబట్టి దావీదు అక్కడ నుండి అడవుల్లోకి పారిపోయాడు.
జీఫు అడవిలో ఉన్నప్పుడు, జీఫీయులు సౌలుకు దావీదు దాక్కున్న చోటు చెప్పారు. యొనాతాను దావీదు దగ్గరకు వచ్చి, “భయపడకు, నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు ఇశ్రాయేలీయులకు రాజవుతావు; నీ తర్వాతి స్థానంలో నేను ఉంటాను. ఇది నా తండ్రియైన సౌలుకు కూడా తెలుసు” అని దేవుని పేరుతో నిబంధన చేశాడు.
10. దావీదు సౌలును ఏన్గెదీలో విడిచిపెట్టడం
సౌలు మూడు వేల మందితో దావీదును వెంబడించాడు. అతను ఏన్గెదీ కొండల్లో ఒక గుహలోకి వెళ్లాడు. ఆ గుహ లోపలే దావీదు, అతని మనుష్యులు దాక్కున్నారు.
దావీదు మనుష్యులు, “‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. దావీదు లేచి, సౌలు అంగీ కొంగును మెల్లగా కోశాడు. వెంటనే అతని మనస్సు నొచ్చుకుని, “ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు. దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు.
అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు వెనక్కి తిరిగి చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఇలా అన్నాడు: “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను. చూడు, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ వస్త్రాన్ని చూడు! నేను మీ వస్త్రపు అంచును కత్తిరించాను, కానీ నిన్ను చంపలేదు. నేను తప్పు చేశాను అనడానికి గాని తిరుగుబాటు చేశాను అని సూచించడానికి నా చేతిలో ఏమీ లేదని చూడండి. నేను నీకు అన్యాయం చేయలేదు, కానీ నీవు నా ప్రాణం తీయడానికి నన్ను తరుముతున్నావు. … యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.
సౌలు దావీదు స్వరం విని, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు. “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను. … తప్పకుండా నీవు రాజవుతావని, ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్ధిరపరచబడుతుందని నాకు తెలుసు. కాబట్టి నీవు నా సంతానాన్ని చంపనని నా తండ్రి కుటుంబం నుండి నా పేరును కొట్టివేయనని యెహోవా పేరిట నాకు ప్రమాణం చేయి” అన్నాడు. దావీదు ప్రమాణం చేశాడు.
11. సమూయేలు మరణం; నాబాలు, అబీగయీలు
ప్రవక్త సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని కోసం ఏడ్చి, రామాలో అతన్ని పాతిపెట్టారు.
దావీదు పారాను అడవికి వెళ్లాడు. అక్కడ నాబాలు అనే ధనవంతుడు ఉన్నాడు. అతని భార్య అబీగయీలు తెలివైనది, అందమైనది. నాబాలు కఠినుడు, దుష్టుడు.
దావీదు తన మనుష్యులను నాబాలు దగ్గరకు పంపి, ఆహారం ఇమ్మని అడిగాడు. నాబాలు మొరటుగా నిరాకరించాడు. దావీదు కోపంతో నాబాలు ఇంటి మీదకు వెళ్తుండగా, అబీగయీలు వెంటనే ఆహారం తీసుకుని వెళ్లి దావీదుకు ఎదురుపడింది. ఆమె తన భర్త తప్పును క్షమించమని వేడుకుంది. దావీదు ఆమె మాట విని వెనక్కి తిరిగాడు.
కొన్ని రోజులకు నాబాలు చనిపోయాడు. దావీదు అబీగయీలును పెండ్లి చేసుకున్నాడు. దావీదు యెజ్రెయేలుకు చెందిన అహీనోయమును కూడా వివాహం చేసుకున్నాడు. సౌలు దావీదు భార్య మీకాలును తీసుకుని, పల్తీ అనే వ్యక్తికి ఇచ్చాడు.
12. దావీదు సౌలును రెండవసారి విడిచిపెట్టడం
జీఫీయులు మళ్లీ సౌలుకు దావీదు ఉన్న చోటు చెప్పారు. సౌలు మూడు వేల మందితో వచ్చాడు. రాత్రి సౌలు సైన్యం నిద్రిస్తున్నప్పుడు, దావీదు, అబీషై శిబిరంలోకి వెళ్లారు. సౌలు తల దగ్గర ఈటె, నీళ్ల గిన్నె ఉన్నాయి.
దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని అబీషైని అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు. వారు రాత్రివేళ శిబిరంలోకి వెళ్ళినప్పుడు సౌలు నిద్రపోతున్నాడు. అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు. అయితే దావీదు అబీషైతో, “అతన్ని చంపవద్దు, యెహోవా అభిషేకించిన వానిని చంపినవారు నిర్దోషులుగా ఉండగలరా? … యెహోవాయే అతన్ని శిక్షిస్తారు; అతని సమయం వచ్చినప్పుడు అతడే చనిపోతాడు లేదా యుద్ధంలో నశిస్తాడు. అయితే యెహోవా అభిషేకించిన వానిపైకి నేను చేయి ఎత్తకుండ యెహోవా నన్ను ఆపివేయును గాక. అతని తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకుని మనం వెళ్లిపోదాం రా” అని చెప్పాడు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి ఎవరూ వారిని చూడలేదు. వారు వాటిని తీసుకుని వెళ్లిపోయారు.
దూరం నుండి దావీదు అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు. అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు. సౌలు దావీదు మాట గుర్తించి, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.
దావీదు వెళ్లిపోయాడు.
13. దావీదు ఫిలిష్తీయుల మధ్య జీవించడం
దావీదు తనలో, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు. ఆరు వందల మందితో గత్ రాజు ఆకీషు దగ్గరకు వెళ్లాడు. ఆకీషు దావీదుకు జిక్లగు పట్టణం ఇచ్చాడు.
దావీదు అక్కడ నుండి గెషూరీయులు, గిర్జీయులు, అమాలేకీయులపై దాడి చేసేవాడు. ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని అబద్ధం చెప్పేవాడు. ఆకీషు దావీదును నమ్మాడు.
14. జిక్లగు నాశనం, తిరిగి సంపాదించడం
ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును తనతో రమ్మన్నాడు. కానీ ఫిలిష్తీయుల సేనాధిపతులు ఆకీషుమీద కోప్పడి, “నీవు ఇతనికి కేటాయించిన పట్టణానికి ఇతన్ని తిరిగి పంపించు. ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనకే వ్యతిరేకంగా మారతాడేమో!” అని ఒప్పుకోలేదు. దావీదు జిక్లగుకు తిరిగి వెళ్లాడు.
జిక్లగు చేరేసరికి, అమాలేకీయులు పట్టణాన్ని కాల్చి, స్త్రీలను, పిల్లలను, దావీదు భార్యలను చెరపట్టారు. దావీదు, అతని మనుష్యులు బిగ్గరగా ఏడ్చారు. కొంతమంది దావీదును రాళ్లతో కొట్టాలని కూడా అనుకున్నారు. కానీ దావీదు యెహోవాలో తనను బలపరచుకున్నాడు.
దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అన్నాడు.
దావీదు నాలుగు వందల మందితో వెంబడించాడు. దారిలో ఒక ఐగుప్తు యువకుడు దొరికాడు. అతను దారి చూపించాడు. దావీదు అమాలేకీయులను ఓడించి, అందరినీ, సంపదను తిరిగి తీసుకువచ్చాడు. ఏదీ పోలేదు.
15. సౌలు మరణం, దావీదు విలాపం
ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను ఓడించారు. సౌలు కొడుకులు యొనాతాను, అబీనాదాబు, మల్కీషువ చనిపోయారు. సౌలు తీవ్రంగా గాయపడి, తన ఆయుధధారిని చంపమని చెప్పాడు. అతను భయపడి చంపలేదు. సౌలు తన కత్తి మీద పడి చనిపోయాడు.
ఫిలిష్తీయులు సౌలు శరీరాన్ని, కొడుకుల శరీరాలను తీసుకెళ్లి అవమానించారు. యాబేషు గిలాదు ప్రజలు వాటిని తీసుకువచ్చి పాతిపెట్టారు.
ఒక వ్యక్తి దావీదు దగ్గరకు వచ్చి, “నేను అతని ప్రక్కన నిలబడి అతన్ని చంపేశాను” అని సౌలు గురించి చెప్పాడు. దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అతన్ని చంపించాడు.
దావీదు సౌలు, యొనాతానుల కోసం విలాపగీతం పాడాడు:
“ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా!” — 2 సమూయేలు 1:19, 23, 26-27
16. దావీదు యూదాకు, తర్వాత ఇశ్రాయేలు అంతటికీ రాజు అవ్వడం
దావీదు, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు, “వెళ్లు” అన్నాడు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగినప్పుడు, దేవుడు, “హెబ్రోనుకు వెళ్లు” అన్నాడు.
యూదా ప్రజలు దావీదును యూదా రాజుగా అభిషేకించారు. దావీదు హెబ్రోనులో యూదా మీద ఏడు సంవత్సరాల ఆరు నెలలు రాజ్యం చేశాడు.
సౌలు సేనాధిపతి అబ్నేరు, సౌలు కొడుకు ఈష్బోషెతును ఇశ్రాయేలు మిగతా భాగానికి రాజుగా చేశాడు. ఇశ్రాయేలు మిగతా భాగం ఈష్బోషెతు వైపు, యూదా మాత్రం దావీదు వైపు ఉన్నాయి.
చాలా కాలం యుద్ధం జరిగింది. దావీదు బలపడుతూ ఉండగా, సౌలు ఇల్లు బలహీనపడింది.
అబ్నేరు దావీదు వైపు చేరాడు, కానీ యోవాబు అతన్ని మోసంగా చంపాడు. దావీదు అబ్నేరు మరణానికి దుఃఖించాడు. తర్వాత ఈష్బోషెతును అతని సేనాధిపతులు చంపి, తలను దావీదుకు తెచ్చారు. దావీదు వారిని కూడా చంపించాడు.
చివరకు ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనుకు వచ్చి, దావీదుతో నిబంధన చేసి, అతన్ని ఇశ్రాయేలు అంతటికీ రాజుగా అభిషేకించారు.
దావీదు ముప్పై ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. అతను నలభై సంవత్సరాలు రాజ్యం చేశాడు.
17. దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం
దావీదు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లి యెబూసీయులతో యుద్ధం చేశారు. యెబూసీయులు, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అని ఎగతాళి చేశారు. కానీ దావీదు సీయోను కోటను పట్టుకున్నాడు; అది దావీదు నగరం అయ్యింది.
తూరు రాజు హీరాము దేవదారు కలప, వడ్రంగులు, రాతిపనివారిని పంపి దావీదుకు రాజభవనం కట్టించాడు.
దావీదు యెరూషలేములో మరికొంత మంది భార్యలను చేసుకున్నాడు. అతనికి షమ్మూవ, షోబాబు, నాతాను, సొలొమోను మొదలైన కొడుకులు పుట్టారు.
ఫిలిష్తీయులు దావీదు రాజయ్యాడని తెలుసుకుని యుద్ధానికి వచ్చారు. దావీదు దేవుణ్ణి అడిగాడు; దేవుడు అతనికి రెండుసార్లు విజయం ఇచ్చాడు.
18. దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం
దావీదు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలనుకున్నాడు. మొదటిసారి బండిపై తీసుకువస్తుండగా, ఉజ్జా అనే వ్యక్తి మందసాన్ని పట్టుకున్నాడు. దేవుడు అతన్ని చంపాడు. దావీదు భయపడి, మందసాన్ని ఓబేదెదోము ఇంటికి పంపాడు. మూడు నెలలు అతని ఇంట్లో ఉంది; దేవుడు అతన్ని ఆశీర్వదించాడు.
తర్వాత దావీదు మందసాన్ని చాలా సంతోషంతో యెరూషలేముకు తీసుకువచ్చాడు. అతను నారు ఏఫోదు ధరించి, యెహోవా ఎదుట తన పూర్తి శక్తితో నాట్యం చేశాడు.
మీకాలు కిటికీ నుండి చూసి, దావీదును తృణీకరించింది. దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను” అన్నాడు. మీకాలుకు చనిపోయే వరకు పిల్లలు కలగలేదు.
19. దేవుడు దావీదుతో నిబంధన చేయడం
దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. ప్రవక్త నాతానుతో చెప్పాడు. ఆ రాత్రి దేవుడు నాతానుకు వేరే సందేశం ఇచ్చాడు.
దేవుడు దావీదును గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తీసుకుని, ఇశ్రాయేలుపై నాయకుడిగా చేశాడు. దావీదు కొడుకే దేవుని నామానికి మందిరం కడతాడని, దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు.
“నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది” — 2 సమూయేలు 7:16
దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని, “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?” అని ప్రార్థించాడు.
20. దావీదు విజయాలు, మెఫీబోషెతుకు కృప
దావీదు ఫిలిష్తీయులను, మోయాబీయులను, సోబా రాజు హదదెజరును, దమస్కు సిరియన్లను, ఎదోమీయులను, అమ్మోనీయులను ఓడించాడు.
తర్వాత దావీదు యొనాతాను నిమిత్తం సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని విచారించాడు. యొనాతాను కొడుకు మెఫీబోషెతు ఉన్నాడు; అతను రెండు కాళ్లకు కుంటివాడు.
దావీదు అతన్ని పిలిపించి, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
మెఫీబోషెతు నమస్కారం చేసి, “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నీవు దయ చూపడానికి నీ సేవకుడనైన నేను ఎంతటివాన్ని?” అన్నాడు. దావీదు సౌలు ఆస్తి అంతా అతనికి ఇచ్చి, సీబాను పని చేయడానికి నియమించాడు. మెఫీబోషెతు దావీదు బల్ల వద్ద రాజు కుమారులలో ఒకడిగా భోజనం చేశాడు.
21. దావీదు, బత్షెబ, ఊరియా
వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో, దావీదు యోవాబును సైన్యంతో పంపి, తాను యెరూషలేములో ఉన్నాడు.
ఒక సాయంత్రం దావీదు మేడపై నడుస్తుండగా, ఒక అందమైన స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమె హిత్తీయుడైన ఊరియా భార్య బత్షెబ. దావీదు ఆమెను పిలిపించి, ఆమెతో శయనించాడు; ఆమె గర్భవతి అయ్యింది.
దావీదు పాపాన్ని కప్పడానికి ఊరియాను యుద్ధం నుండి ఇంటికి పంపించాలనుకున్నాడు. ఊరియా వచ్చాడు, కానీ ఇంటికి వెళ్లలేదు. “మందసం, ఇశ్రాయేలీయులు, యూదా వారు గుడారాల్లోనే ఉంటున్నారు. నా దళాధిపతియైన యోవాబు, నా ప్రభువు యొక్క సైనికులు పొలిమేరల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇంటికి వెళ్లి తిని త్రాగి, నా భార్యతో ఎలా సంతోషించగలను? నీ జీవం తోడు, నేను అలా చేయను” అన్నాడు.
దావీదు ఊరియాను తాగించాడు, అయినా ఇంటికి వెళ్లలేదు. చివరకు దావీదు యోవాబుకు ఉత్తరం రాసి, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని ఊరియా చేతికే ఇచ్చి పంపాడు. యోవాబు అలా చేశాడు; ఊరియా చనిపోయాడు.
బత్షెబ భర్త కోసం ఏడ్చింది. తర్వాత దావీదు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి పెండ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి కొడుకును కన్నది.
కానీ దావీదు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదిగా ఉంది.
22. నాతాను దావీదును గద్దించడం
యెహోవా నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపాడు. నాతాను ఒక కథ చెప్పాడు:
ఒక ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక పేదవాడికి ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రమే ఉంది; అది అతనికి కూతురిలా ఉంది. ఒక అతిథి వచ్చినప్పుడు, ధనవంతుడు పేదవాడి గొర్రెపిల్లను తీసుకుని వండాడు.
అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి! వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు.
నాతాను, “ఆ మనిషివి నీవే!” అన్నాడు.
నాతాను దేవుని మాటలు ప్రకటించాడు: దేవుడు దావీదును అభిషేకించి, సౌలు చేతి నుండి రక్షించి, అన్నీ ఇచ్చాడు. కానీ దావీదు దేవుని మాటను తృణీకరించి, ఊరియాను చంపి, అతని భార్యను తీసుకున్నాడు. కాబట్టి కత్తి దావీదు ఇంటి నుండి తొలగదు; అతని ఇంటి నుండే కీడు లేస్తుంది; అతని భార్యలను అతని కళ్ల ముందే మరొకరికి ఇవ్వబడుతుంది.
దావీదు, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు.
నాతాను, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు’ ” అన్నాడు.
పిల్లవాడు జబ్బుపడ్డాడు. దావీదు ఉపవాసం ఉండి, నేలపై పడుకున్నాడు. ఏడవ రోజు పిల్లవాడు చనిపోయాడు. దావీదు లేచి, స్నానం చేసి, దేవుని మందిరానికి వెళ్లి ఆరాధించి, భోజనం చేశాడు.
తర్వాత బత్షెబ మరో కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించాడు.
23. అమ్నోను, తామారు, అబ్షాలోము
దావీదు కొడుకు అమ్నోను తన సోదరి తామారును బలవంతం చేశాడు. తామారు అబ్షాలోముకు స్వంత సోదరి.
అమ్నోను తామారును వలచి, జబ్బు పడ్డాడు. తన స్నేహితుడు యొనాదాబు సలహాతో, జబ్బుపడినట్టు నటించి, తామారును వంట చేయడానికి పిలిపించాడు. ఆమె వచ్చినప్పుడు, అమ్నోను ఆమెను బలవంతం చేశాడు. ఆ తర్వాత అతనికి ఆమెపై విపరీతమైన ద్వేషం కలిగింది; ఆమెను వెళ్లగొట్టాడు.
తామారు బట్టలు చింపుకుని, తలపై బూడిద వేసుకుని, ఏడుస్తూ వెళ్లింది. అబ్షాలోము ఆమెను చూసి, ఓదార్చాడు. దావీదు ఈ విషయం విని కోపగించాడు, కానీ అమ్నోనును శిక్షించలేదు.
అబ్షాలోము రెండు సంవత్సరాలు పగ పెంచుకుని, చివరకు గొర్రెల బొచ్చు కత్తిరించే పండుగ సమయంలో అమ్నోనును చంపించాడు. అబ్షాలోము గెషూరుకు పారిపోయాడు.
తర్వాత యోవాబు ద్వారా అబ్షాలోము యెరూషలేముకు తిరిగి వచ్చాడు, కానీ దావీదు అతన్ని చాలా కాలం చూడలేదు.
24. అబ్షాలోము తిరుగుబాటు, మరణం
అబ్షాలోము ప్రజల హృదయాలను దొంగిలించుకున్నాడు. అతను నగర ద్వారం దగ్గర నిలబడి, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.
కొంతకాలం తర్వాత అబ్షాలోము తనను రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదు యెరూషలేము నుండి పారిపోయాడు. షిమీ అనే వ్యక్తి దావీదును శపిస్తూ రాళ్లు విసిరాడు. దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి” అన్నాడు.
అహీతోఫెలు అబ్షాలోముకు సలహాదారుగా ఉన్నాడు. హూషయి దావీదు పక్షంగా రహస్యంగా పని చేశాడు.
యుద్ధంలో అబ్షాలోము ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో తల చిక్కుకుని వేలాడిపోయాడు. యోవాబు అతన్ని మూడు ఈటెలతో పొడిచి చంపాడు.
దావీదు కొడుకు చనిపోయాడని తెలిసి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని గుండెలవిసేలా ఏడ్చాడు.
తర్వాత షెబ అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు; యోవాబు అతన్ని కూడా అణచివేశాడు.
25. దావీదు జనాభా లెక్క, తెగులు
దావీదు ఇశ్రాయేలు, యూదా జనాభా లెక్కించమని యోవాబుకు ఆజ్ఞాపించాడు. యోవాబు, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అడిగాడు. కానీ రాజు మాటే నెగ్గింది.
లెక్క పూర్తయిన తర్వాత, దావీదు హృదయం అతన్ని నిందించింది. అతను దేవునితో, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అన్నాడు.
దేవుడు ప్రవక్త గాదు ద్వారా మూడు శిక్షలు ఇచ్చాడు: ఏడు సంవత్సరాల కరువు, మూడు నెలలు శత్రువుల ముందు పారిపోవడం, మూడు రోజుల తెగులు. దావీదు, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే మేము పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని తెగులు ఎంచుకున్నాడు.
దేవుడు తెగులు పంపాడు; డెబ్బై వేల మంది చనిపోయారు. దూత యెరూషలేమును నాశనం చేయబోగా, యెహోవా ఆపాడు.
దావీదు అరౌనా కళ్లం స్థలంలో బలిపీఠం కట్టాడు. అరౌనా ఉచితంగా ఇవ్వబోగా, దావీదు, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అని డబ్బు చెల్లించాడు. బలులు అర్పించగా, తెగులు ఆగిపోయింది.
26. దావీదు ఆలయ నిర్మాణానికి సన్నాహాలు
దావీదు తాను ఆలయం కట్టకపోయినా, దానికోసం చాలా సామగ్రి సిద్ధం చేశాడు. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, రాళ్లు, కలప సమకూర్చాడు. సొలొమోనుకు ఆలయ ప్రణాళిక ఇచ్చాడు.
దావీదు, “యెహోవా మందిరం కట్టడానికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. దాని కోసం లక్ష తలాంతుల బంగారాన్ని, పది లక్షల తలాంతుల వెండిని, తూయలేనంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చాను. చెక్క, రాళ్లు కూడా సమకూర్చాను. నీవింకా వాటికి కలుపవచ్చు” అన్నాడు. ప్రజలు కూడా ఉదారంగా కానుకలు ఇచ్చారు.
27. దావీదు చివరి రోజులు
దావీదు వృద్ధుడైనప్పుడు, అతని కొడుకు అదోనీయా తనను రాజుగా ప్రకటించుకున్నాడు. నాతాను ప్రవక్త, బత్షెబ ఈ విషయం దావీదుకు చెప్పారు.
దావీదు బత్షెబతో, “నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అని తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు. సొలొమోనును అభిషేకించారు.
దావీదు సొలొమోనుకు ఇలా చెప్పాడు:
“మనుష్యులందరు వెళ్లవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు” — 1 రాజులు 2:2-3
దావీదు నలభై సంవత్సరాలు రాజ్యం చేసి, వృద్ధుడై, సంపదతో, గౌరవంతో చనిపోయాడు. అతన్ని దావీదు నగరంలో పాతిపెట్టారు.
28. దావీదు వారసత్వం: కీర్తనలు, వీరులు, వాగ్దానం
దావీదు కేవలం రాజు మాత్రమే కాదు; అతను కీర్తనల రచయిత. అతని జీవితంలోని సంఘటనలకు సంబంధించిన కీర్తనలు:
- కీర్తన 23 — “యెహోవా నా కాపరి”
- కీర్తన 34 — దావీదు అబీమెలెకు ఎదుట పిచ్చివాడిలా నటించినప్పుడు
- కీర్తన 51 — నాతాను దావీదును గద్దించిన తర్వాత
- కీర్తన 57 — దావీదు సౌలు నుండి గుహలోకి పారిపోయినప్పుడు
- కీర్తన 59 — సౌలు దావీదు ఇంటిని కాపలా పెట్టినప్పుడు
- కీర్తన 63 — దావీదు యూదా అడవిలో ఉన్నప్పుడు
- కీర్తన 142 — దావీదు గుహలో ఉన్నప్పుడు
దావీదుకు బలమైన వీరులు ఉన్నారు:
- యాషోబెయాము ఒకేసారి ఎనిమిది వందల మందిని చంపాడు.
- ఎలియాజరు ఒంటరిగా నిలబడి ఫిలిష్తీయులను ఓడించాడు.
- షమ్మా పొలం మధ్యలో నిలబడి దానిని కాపాడాడు.
- బెనాయా మంచు రోజున గోతిలో సింహాన్ని చంపాడు; ఐగుప్తు వీరుడిని అతని ఈటెతోనే చంపాడు.
దావీదు చివరి మాటలు 2 సమూయేలు 23లో ఉన్నాయి:
“యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడారు; ఆయన మాట నా నాలుక మీద ఉంది. ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు, ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు: ‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు, దేవుని భయం కలిగి పాలించేవాడు, అతడు మబ్బులు లేని ఉదయాన సూర్యోదయపు వెలుగులాంటివాడు’ ” — 2 సమూయేలు 23:2-4
దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం — అతని సింహాసనం శాశ్వతంగా స్థిరపడుతుందన్నది — చివరకు యేసు క్రీస్తు ద్వారా నెరవేరింది. యేసును దావీదు కుమారుడు అని పిలుస్తారు.
దావీదు కథ మనకు నేర్పేది
దావీదు జీవితం కేవలం గొల్యాతును ఓడించిన కథ కాదు. గొల్యాతు ఒక్క అధ్యాయం మాత్రమే.
దావీదు నేర్చుకున్నాడు:
- సౌలు తనను వెంబడిస్తున్నప్పుడు ఎదురుచూడడం
- ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా వదులుకోవడం
- పెద్ద నష్టం తర్వాత తిరిగి లేవడం
- సంక్షోభంలో ప్రజలను నడిపించడం
- తీవ్రమైన పాపం తర్వాత దేవునితో నిజాయితీగా మాట్లాడడం
దావీదు స్థిరపడక ముందే అభిషేకించబడ్డాడు. గుర్తించబడక ముందే ఎంచుకోబడ్డాడు. వాగ్దానం నెరవేరక ముందే దాన్ని పొందాడు.
అనేకసార్లు, పరిస్థితులు వాగ్దానం నెరవేరదని చెప్పినట్టు అనిపించినా, దేవునిపై నమ్మకం ఉంచాడు.
దేవుడు వాగ్దానం చేసినదానికి, దావీదు కళ్లకు కనిపించినదానికి మధ్య ఉన్న దూరమే అతని కథలో అత్యంత శక్తివంతమైన భాగం.
కొన్నిసార్లు విశ్వాసం అంటే ముందున్న సింహాసనం చూడడం కాదు. అది అరణ్యంలో నమ్మకంగా ఉండడం మాత్రమే.
సంబంధిత ఆర్టికల్స్
మీరు ప్రజలు మంచిగా ఉన్నట్టు నటించి, అవకాశం వచ్చినప్పుడల్లా హాని చేస్తున్న సమయంలో ఉన్నా, లేదా జీవితంలో అత్యంత భయంకరమైన సమయంలో దేవుడు నిజంగా మీతో ఉన్నాడా అని ఆలోచిస్తున్నా, ఈ సంబంధిత ఆర్టికల్స్ మీకు నేరుగా సహాయపడతాయి:
- అందరూ మంచిగా ఉన్నట్టు నటిస్తూ, అవకాశం వచ్చినప్పుడల్లా నాకు హాని చేస్తుంటే, నేను ఎవరిని నమ్మాలి?
- నా జీవితంలో అత్యంత భయంకరమైన సమయంలో — దేవుడు నిజంగా నాతో ఉన్నాడా?
- అబ్రాహాము జీవిత చరిత్ర: బైబిల్ ఆధారంగా పూర్తి కథ, విశ్వాసం మరియు వాగ్దానాలు
- ఇస్సాకు జీవిత చరిత్ర – విశ్వాసం, విధేయత, దేవుని వాగ్దానానికి సాక్ష్యమైన జీవితం
- యోసేపు జీవితం: బైబిల్లోని అద్భుతమైన జీవిత కథ
- మరిన్ని తెలుగు బైబిల్ వ్యాసాలు
దావీదు కథకు సంబంధించిన బైబిల్ వచనాలు
- సౌలు నిరాకరణ, దావీదు అభిషేకం — 1 సమూయేలు 16:1–13
- దావీదు సౌలు దగ్గర సేవ — 1 సమూయేలు 16:14–23
- దావీదు గొల్యాతును ఓడించడం — 1 సమూయేలు 17:1–58
- యొనాతాను స్నేహం, సౌలు అసూయ — 1 సమూయేలు 18:1–16
- మేరాబు, మీకాలు — 1 సమూయేలు 18:17–30
- సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించడం, మీకాలు సహాయం — 1 సమూయేలు 19:1–24
- దావీదు, యొనాతాను నిబంధన — 1 సమూయేలు 20:1–42
- అహీమెలెకు, దోయేగు, నోబు — 1 సమూయేలు 21:1–9; 22:6–23
- దావీదు గత్లో పిచ్చివాడిలా నటించడం — 1 సమూయేలు 21:10–15
- అదుల్లాము గుహ, మోయాబు — 1 సమూయేలు 22:1–5
- కెయీలా, ఏన్గెదీ — 1 సమూయేలు 23:1–29; 24:1–22
- నాబాలు, అబీగయీలు — 1 సమూయేలు 25:1–44
- దావీదు సౌలును రెండవసారి విడిచిపెట్టడం — 1 సమూయేలు 26:1–25
- జిక్లగు, అమాలేకీయులు — 1 సమూయేలు 27:1–28:2; 30:1–31
- సౌలు మరణం, దావీదు విలాపం — 1 సమూయేలు 31:1–13; 2 సమూయేలు 1:1–27
- దావీదు రాజు అవ్వడం, యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం — 2 సమూయేలు 2:1–7; 5:1–16
- మందసం యెరూషలేముకు రావడం — 2 సమూయేలు 6:1–23
- దేవుడు దావీదుతో నిబంధన — 2 సమూయేలు 7:1–29
- దావీదు యుద్ధ విజయాలు — 2 సమూయేలు 8:1–18
- దావీదు మెఫీబోషెతుకు కృప — 2 సమూయేలు 9:1–13
- దావీదు, బత్షెబ, ఊరియా — 2 సమూయేలు 11:1–27
- నాతాను గద్దింపు, పిల్లవాడి మరణం, సొలొమోను జననం — 2 సమూయేలు 12:1–25
- అమ్నోను, తామారు, అబ్షాలోము — 2 సమూయేలు 13:1–39
- అబ్షాలోము తిరుగుబాటు, మరణం — 2 సమూయేలు 15:1–18:33; 19:1–43
- షెబ తిరుగుబాటు — 2 సమూయేలు 20:1–22
- జనాభా లెక్క, తెగులు — 2 సమూయేలు 24:1–25
- దావీదు ఆలయ సన్నాహాలు — 1 దినవృత్తాంతములు 22:1–19; 28:1–21; 29:1–9
- అదోనీయా, సొలొమోను అభిషేకం — 1 రాజులు 1:1–53
- దావీదు చివరి మాటలు — 2 సమూయేలు 23:1–7
- దావీదు వీరులు — 2 సమూయేలు 23:8–39; 1 దినవృత్తాంతములు 11:10–47
- దావీదు కీర్తనలు — కీర్తనలు 23, 34, 51, 57, 59, 63, 142
- దావీదు మరణం — 1 రాజులు 2:10–11; 1 దినవృత్తాంతములు 29:26–28
గమనిక
1. వచనం: ఈ వ్యాసంలోని బైబిల్ వచనాలు Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ (Biblica® Open Telugu Contemporary Version™) నుండి తీసుకున్నవి. ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. ఇవి CC BY-SA 4.0 లైసెన్స్ కింద ఉపయోగించబడ్డాయి (మూలం: ebible.org/telotsa). దీనిని Biblica ఆమోదించినట్టు కాదు. ప్రతి వచనం కింద, అది ఏ సందర్భంలో చెప్పబడిందో వివరించాం. వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మీ బైబిల్లో ఆ అధ్యాయాన్ని మొత్తం చదవండి.
2. భాష: బైబిల్ గురించి ఎక్కువగా తెలియనివారికి కూడా అర్థమయ్యేలా ఈ వ్యాసాన్ని సాధారణ తెలుగులో రాశాం. ఇది వ్యక్తిగత అధ్యయనం, అవగాహన కోసం రాసిన వ్యాసం. అధికారిక బైబిల్ వ్యాఖ్యానం కాదు.
3. చరిత్ర: ఈ వ్యాసంలో బైబిల్ చరిత్రలో లేని అదనపు వివరణలు ఎక్కడైనా ఇస్తే, అవి కేవలం అర్థం చేసుకోవడానికి సహాయపడే ఊహాజనిత వివరణలు మాత్రమే అని గమనించండి.
వ్రాసినవారు: టీమ్ HolyBibleWithYou.com
